డ్రాపౌట్‌ నుండి డైనమిక్‌ లీడరుగా ఎదిగిన నాగటి నారాయణ

 ఒక చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుండి ఎదిగి రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఉద్యమాలకు అగ్రశ్రేణి నాయకుడుగా వన్నెకెక్కారు. నేడు హైదరాబాదులో సామాజిక విద్యావేత్తగా విశేష కషి చేస్తున్నారు. విద్యారంగ సమస్యలపై పరిశోధనాత్మక అధ్యయనంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో కూడిన వ్యాసాలతో మంచి ప్రచారం చేస్తున్నారు. మహాత్మా జ్యోతిభాఫూలే, సావిత్రిబాయి ఫూలే బోధనలు, ఆశయాల బాటలో నిమ్న జాతుల విద్యాభివద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దళిత, అణగారిన కులాల నుండి కష్టపడి చదివి పైకొచ్చిన వారు అన్ని రంగాల్లోనూ నాయకులుగా రాణించాల్సిన అవసరాన్ని తన రచనల ద్వారా చైతన్య పరుస్తున్నారు. ఎంతటి సంక్లిష్ట సమస్యనైనా అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో సమగ్ర అధ్యయనం, అంచనా, ప్రణాళిక ద్వారా సమిష్టి కషితో సాధించడం ఆయన ప్రత్యేకత. ఆయన జీవిత విశేషాలు, ఉద్యమాల నేపథ్యం విద్యార్థులకు, యువతకు, సామాజికశక్తులకు మార్గదర్శనం చేస్తుందని భావిస్తున్నాం. దళితశక్తి సామాజిక మాసపత్రిక పాఠకుల కోసం ప్రత్యేకంగా...


 అర్ధాకలితో గడిచిన బాల్యం
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని పెద్దబీరవల్లి గ్రామంలో 1956 డిసెంబర్‌ 4న పుట్టిన నారాయణ దళిత కుటుంబాల నిరుపేద జీవితాన్నే అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాటం పుణ్యాన దళిత కుటుంబాలకు దక్కిన భూముల్లో భాగంగా రెండున్నర ఎకరాల భూమి వున్నా, ఆనాడు పంటలు పండేదికాకపోవడం వలన తల్లిదండ్రులు సామేలు, సుందరమ్మ కూలీ పనులే చేసేవారు. వారికి కలిగిన నలుగురు పిల్లల్లో వైద్యం చేయించే స్తోమతు లేక మొదటి సంతానం మగబిడ్డ పుట్టిన నాలుగు రోజుల్లోనే చనిపోగా, నారాయణ పెద్ద చెల్లెలు విక్టోరియా రాణి స్ఫోటకం జబ్బుతో ఎనిమిదేళ్ల వయసులో చనిపోయింది. కాగా చెల్లెలు మేరీతోపాటు కుటుంబంలో నలుగురే వున్నా అమ్మా, నాన్న ఇద్దరు పొద్దస్తమానం పనిచేసినా అర్ధాకలితోనే బతికేవారు. వరినాట్లు (ఊడుపులు) సీజన్లో మాల, మాదిగ కుటుంబాలతోపాటు కష్ణా జిల్లా గుడ్లవల్లేరు, నందివాడ, రామాపురం (అక్కినేని నాగేశ్వర్‌రావు స్వగ్రామం), కుదరవల్లి తదితర గ్రామాలకు వలసబోయి రెండు నెలలకు పైగా కూలి చేసి వచ్చిన డబ్బులతో బెజవాడలో బట్టలు కొనుక్కుని వచ్చేవారు. ఎండాకాలం పనులు దొరకని రోజుల్లో ఒకపూట కొద్దిగా తింటే రెండు పూటలు పస్తులే. వాగులు, చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకొచ్చేవారు. పది పదిహేను సంవత్సరాల వయసులో ఆకలికి తట్టుకోలేక సావాసగాళ్ళతో కలిసి ఈతబొత్తాలు నరికి లోపల వుండే మెత్తటి గుజ్జు తిని, చెట్లనుండి రాలిపడ్డ తాటిపండ్లు చీకి బతికేవారు. పిల్లలతో సహా కుటుంబంలోని అందరూ పనిచేసినా పస్తులుండే కటిక దారిద్య్రంలో మగ్గుతున్నా తండ్రి పట్టుదలతో నారాయణ చదువుకోగలిగారు.


నేనూ డ్రాపౌట్‌ నే..
పాఠశాల విద్య దశలో పడిన కష్టాలు గురించి ఇలా చెబుతూ.. ''తరచుగా బడి మానేసే (డుమ్మా కొట్టే) విద్యార్థుల్లో దళితులు, గిరిజనులే ఎక్కువ ఎందుకుంటారో ఉపాధ్యాయుడుగా పనిచేసిన కొద్దిరోజులకే అర్థమైంది. పదో తరగతిలోపు రెండు సార్లు డ్రాపౌట్‌ అయ్యాను. పద్యాలు కంఠస్థం పట్టడం, లెక్కలు చేయడం, హౌంవర్క్‌ పూర్తి చేయడం చేతగాకపోవడం వలన ఉపాధ్యాయులు బాగా కొట్టేవారు. గోడకుర్చీ వేయించడం, కోదండం (దూలానికి కట్టిన తాడు పట్టుకుని వేలాడుతుంటే కాళ్ళకింద ముళ్లకంప పెట్టడం) పట్టించడం వంటి శిక్షలకు భయపడి బడి మానేయాల్సి వచ్చేది. బడికి పోలేదని తెలిస్తే ఇంట్లో నాన్న కొట్టేవాడు. బడిలో ఇంట్లో బాదే దెబ్బల్ని తట్టు కోలేక పగలు చేలల్లో తిరుగుతూ రాత్రిళ్ళు సావాసగాళ్ళ ఇళ్లల్లో వుంటూ కొన్ని రోజులు ఇంటికి పోయేవాడిని కాదు. రోజుల తరబడి గౖెెర్హాజరు కావడంతో నాలుగో తరగతిలో డ్రాపౌట్‌ అయ్యాను. ఊళ్ళో వున్న చిన్నబడిలో ఐదో తరగతి పాసైన తర్వాత పొరుగూరు జానకీపురంలోని హైస్కూలులో ఆరో తరగతిలో చేరాలంటే పుస్తకాలూ, బట్టలు కొనడానికి డబ్బు కావాల్సి వచ్చింది. నన్ను తీసుకుని మా నాన్న ఊళ్లోని ఒక ధనిక రైతు ఇంటికెళ్లి అప్పు అడిగితే ఆయన అప్పుచేసి చదివించడం ఎందుకని చీదరించుకున్నాడు. వారానికోసారి మా మాలపల్లికి వచ్చి అందరినీ పలకరించే ఆర్‌సిఎం (రోమన్‌ కేథలిక్‌ మిషన్‌) పంతులు జాన్‌గారు మా నాన్నతో మాట్లాడిన తర్వాత పొద్దుటూరులోని చర్చి ఫాదర్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఇచ్చిన డబ్బుతో బుక్స్‌, బట్టలు కొనుక్కుని హైస్కూల్‌లో ఆరో తరగతిలో జాయిన్‌ అయ్యాను. రెండేళ్ల తర్వాత మరో ఆటంకం ఎదురైంది. ఎనిమిదో తరగతి ప్రారంభంలోనే అమ్మతో కలిసి కుదరవల్లి ఊడుపుల పనికెళ్లి నెలరోజులు పైగా గౖెెర్హాజరయ్యాను. మాకున్న రెండెకరాల పొలంలో పనికోసం మధ్య మధ్యలో కొన్ని రోజులు డుమ్మా కొట్టాల్సి వచ్చేది. దానితో మళ్ళీ డ్రాపౌట్‌ కావాల్సి వచ్చింది. అయినా అబోవ్‌ యావరేజ్‌ స్టూడెంటుననే ఉపాధ్యాయుల సానుభూతితో తొమ్మిదో తరగతికి ప్రమోట్‌ చేసారు. కుటుంబ పేదరికం వలన, పాఠశాలలో ప్రతికూల పరిస్థితుల వలన ఇర్రెగ్యులర్‌ విద్యార్థినైనా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫస్ట్‌ అప్పియర్‌లోనే యాభైశాతం పైగా మార్కులతో పాస్‌ అయ్యాను.''


స్టైపెండుతోనే...
సొంత గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న సిరిపురంలో గల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. స్టూడెంట్స్‌ సెల్ఫ్‌ మేనేజిమెంట్‌ హాస్టల్లో వున్నా స్టయిఫండ్‌ సకాలంలో రాక సమయానికి సరైన భోజనం దొరికేది కాదు. అందువలన వారంలో రెండు మూడు రోజులు నడిచి ఇంటికి పోయిరావాల్సి వచ్చేది. పుస్తకాలకు, బట్టలకు అవసరమైన డబ్బుల కోసం రోడ్డు పనులు, కాలవ పనులు, బావులు తవ్వే పనులకు పోవాల్సి వచ్చేది. ఆ విధంగా ఇంటర్మీడియట్‌లో కూడా రెగ్యులరుగా కాలేజీకి పోగలిగేవారు కాదు. అందువలన ఇంటర్‌ ఫస్ట్‌ అటెమ్ట్‌లో పాస్‌ కాలేక సప్లిమెంటరీతో పూర్తి చేయడం వలన ఒక సంవత్సరం వథా అయిపోయిందని విద్యార్థిగా అనుభవించిన అనుభావాలు గుర్తు చేసుకున్నారు నారాయణ.
ఆ బ్రేక్‌లోనే 1975 ఏప్రిల్‌ 25న కొండగూడెంలోని మా మేనత్త కూతురు అమతతో పెళ్లయింది. ఇద్దరమూ పొలం పనులు, మట్టి పనులకు పోయేవాళ్ళం. ఆమె ప్రోత్సాహంతోనే 1976లో ఖమ్మంలోని ప్రభుత్వ ఎస్‌ఆర్‌ Ê బిజిఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో బీఏలో చేరారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్‌షిప్‌ నలుగురు క్లాసుమేట్స్‌తో కలిసున్నా రూమ్‌ రెంట్‌కి ఇతర ఖర్చులకు సరిపోయేది కాదు. అందువలన సెలవు రోజుల్లో మరియు కొన్ని వర్కింగ్‌ డేస్‌లో కూడా పనులకు పోవాల్సి వచ్చేది. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ ముగింపులోనే ఖమ్మంలోని టీచర్‌ ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌లో చేరారు. టీచర్‌ ట్రెయినింగ్‌ ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ రాక (జనవరి 1981) ముందే ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీములో టీచర్‌ జాబ్‌ వచ్చింది. 1980 అక్టోబర్‌ 30న ఆనాటి భద్రాచలం సమితిలోని కొత్తపల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాధమికోన్నత ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉపాధ్యాయ వత్తిలో చేరారు. భార్య ప్రోత్సాహంతో చదువు కోవడంతోపాటు టీచర్‌గా ఉద్యోగం సంపాదించడం నా జీవితంలో మరిచిపోలేని రోజులుగా మిగిలిపోయాయని ఆయన భార్య అమృత కోఆపరేషన్‌ లేకుంటే ఈ రోజు నారాయణ ఇలా ఉండేవాడు కాదేమోనని తన భావోద్వేగంతో చెప్పారు. ఇక్కడ ఒక్క విషయం... మహత్మాజ్యోతిరావ్‌ ఫూలే దళిత, బలహీన వర్గాల పిల్లల చదువు చెప్పడం కోసం తన భార్యకు చదువు చెప్పి సావిత్రిబాయి ఫూలేను టీచర్‌గా చేస్తే, నా భార్య కష్టం చేస్తూ నన్ను చదివించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది విద్యార్థులు డ్రాపౌట్‌ అయితే వారిని మళ్ళీ తీసుకువచ్చి ప్రత్యేకంగా స్కూల్లో చేర్పించి చదివించడానికి కృషి చేశానని గర్వంగా చెప్పారు.


ఉద్యోగంతోనే... చైతన్యం
ఉపాధ్యాయుడుగా పనిచేయడం వలన సామాజిక అవగాహన, చైతన్యం పెరుగుదలకు ఎంతో తోడ్పడిందని నారాయణ చెప్పారు. ''షెడ్యూల్డ్‌ ఏజన్సీ ఏరియాల్లోని గిరిజనులకు విద్యావకాశాలు కల్పించడం కోసం 1976 నుండి 'సమీకత గిరిజనాభివద్ది సంస్థ (ఐటిడిఏ)'ల ద్వారా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయబడినవి. మారు మూల అడవుల్లో వుండి, అడిగేవారు అంతగా లేకపోవడం వలన కొందరు అధికారులు, హెడ్మాస్టర్లు, డీప్యూటీ వార్డెన్లు అవినీతికి పాల్పడేవారు. విద్యార్థులకు సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. దుస్తులు, బుక్స్‌, దుప్పట్లు, సబ్బులు, వసతి అన్నీ అరకొరగానే ఇచ్చేవారు. సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిగా రాజ్యాంగం, హక్కులు, విధులు గురించి చెప్పే పాఠాల్లో ఉదాహరణలుగా ఆశ్రమ స్కూల్స్‌, హాస్టళ్లలో వుండే విద్యార్థులకు రావాల్సిన ఎంటైటిల్మెంట్స్‌, ప్రొవిజన్స్‌ గురించి చెప్పేవాడిని. విద్యార్థులు ధైర్యం చేసి తమకు రావాల్సిన ప్రొవిజన్స్‌ గురించి అడిగేవారు. సహఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులతో మమేకమై ఆటలు ఆడేవారిమి. దానితో విద్యార్థులు బాగా దగ్గరయ్యేవారు. ఐదారుగురు విద్యార్థులు రాత్రిపూట మా ఇంట్లోనే చదువుకుని పడుకునేవారు (వారిలో బాలు, భద్రు, ప్రభాకర్‌, రత్నారావ్‌ ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు). అదంతా సహించని హెడ్మాస్టర్‌ జిల్లా గిరిజన సంక్షేమ అధికారితో కలిసి నన్ను బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) నా బదిలీని రద్దు చేయించింది. ఆ విషయాలన్నీ తెలుసుకున్న గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాకు అభిమానులు అయ్యారు. ఆనాటి గ్రామ సర్పంచ్‌ చిన్నబ్బి, గ్రామ పెద్దలు చిన్నయ్య, రామాచారి, వీరాస్వామి, తదితరులు స్కూలుకి సంబంధించిన సమస్యలను నాతో చర్చించేవారు. నేను పనిచేసిన రెండో స్కూల్‌ కే.రేగుబెల్లిలో నేనే హెడ్మాస్టర్‌ కావడం వలన విద్యార్థులకు ఎక్కువ న్యాయం చేయడానికి కషి చేశాను. కానీ మూడో స్కూల్‌ మూలపోచారం నుండి యుటిఎఫ్‌ జిల్లా బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులతో సాన్నిహిత్యం కంటే ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్రీకరించాల్సి వచ్చింది. నాలుగోది బొజ్జాయి గూడెం ఆశ్రమ హైస్కూలుకి హెడ్మాస్టర్ని అయినా ప్రభుత్వం ఇచ్చిన ఆన్‌ డ్యూటీ సదుపాయంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో వుంటూ ఉపాధ్యాయ సంఘం ఉద్యమ రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాను. స్కూల్‌ విద్యార్థుల వలే ఉపాధ్యాయ మిత్రులకు సంబంధించిన అనేక అంశాల్లో ముందుండి పోరాటం చేసే తత్వం ఎక్కువగా ఏర్పడిందని తెలిపారు.


2013లో వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేయడానికి ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాను. ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఉద్యోగంలో చేరాను. పెద్దవాగు ప్రాజెక్ట్‌ హైస్కూల్‌ హెడ్మారుగా జాయిన్‌ అయి మరోసారి విద్యార్థులతో కలిసి పోయాను. 2014 సెప్టెంబర్‌ 28న కట్టంగూర్‌ దగ్గర జరిగిన కార్‌ యాక్సిడెంటులో నా భార్య అమత చనిపోయింది. నేను సర్వీస్‌ చేసిన యుటిఎఫ్‌ అండగా నిలిచి నన్ను బతికించింది. సూపరేన్యుయేషన్‌ ప్రకారం 2014 డిసెంబర్‌ 31న ఉపాధ్యాయ ఉద్యోగం నుండి రిటైర్‌ అయ్యాను.''


ఉద్యమాల్లో సామాజిక న్యాయం
2000 నుండి 2013 ఏప్రిల్‌ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పెద్ద ఉపాధ్యాయ సంఘం ఏపియుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గిరిజన, మునిసిపల్‌ అన్ని మేనేజిమెంట్లలోని ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే సంఘానికి దళితవాడ నుండి ఎదిగిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు గానూ, రాష్ట్ర ప్రధానకార్యదర్శిగాను పనిచేసింది నారాయణ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు.


యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉపాధ్యాయ ఉద్యమాల ద్వారా సాధించిన కొన్ని విజయాలను గుర్తు చేశారు. ''2000-13 మధ్య 14 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఉద్యమాలు పెద్దఎత్తున నిర్వహించబడినవి. యుటిఎఫ్‌ స్వతంత్ర కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమైక్య ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించారు. జెఏసీ రాష్ట్ర కోచైర్మన్‌ బాధ్యతలు నిర్వహించారు. సమస్యలపై ఎజెండాల తయారీలో, ప్రభుత్వంతో జరిగే చర్చల్లో అందరికీ సంబంధించిన జనరల్‌ డిమాండ్లతోపాటు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు మేలు చేసే డిమాండ్ల సాధనకు చొరవ చేయడం జరిగేది. ఉద్యమాల నిర్వహణలో, సమరశీల పోరాటాలు చేయడంలో, ప్రభుత్వంతో జరిగే చర్చల్లో బాబాసాహెబ్‌ స్ఫూర్తితో రాజీలేని కషి చేయడం ద్వారా రాష్ట్ర జెఏసీ రాష్ట్ర కోచైర్మన్‌ డైనమిక్‌ లీడర్‌గా గుర్తింపు అందుకున్నారు. అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించి భారీ సమీకరణలు, పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు జరిగినవి. 2012 సెప్టెంబర్‌ 6-13 ఎనిమిది రోజులు ఎంఎల్‌సిలు శ్రీ కె.ఎస్‌. లకëణరావు, వై.శ్రీనివాసులురెడ్డితో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో అన్ని రోజులు నిరాహార దీక్ష చేయడం అదే తొలిసారి. సదరు ఉద్యమాలు, పోరాటాల సందర్భంలోనే డైనమిక్‌ లీడర్‌ నారాయణ రుజువు చేశారు. ఆ ఉద్యమాలు, పోరాటాల ఫలితం గా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చరిత్రాత్మకమైన విజయాలు లభించినవి. తొమ్మిదో పీఆర్సీలో రికార్డ్‌ స్థాయిలో 39శాతం ఫిట్మెంట్‌ బెనిఫిట్‌ సాధించడంతో జీతాలు గణనీయంగా పెరిగినవి. అంతకు ముందు పీఆర్సీల్లో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ సముచితమైన పే స్కెల్స్‌ సాధించబడినవి.


వెట్టిచాకిరీ లాంటి అప్రెంటిస్‌ విధానం అంతం చేయబడింది. డాక్టర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయుల రెండేళ్ల అప్రెంటిస్‌ సర్వీసును, పన్నెండు వేలమంది ఎస్సీ, ఎస్టీ టీచర్లైన 2002 స్పెషల్‌ విద్యా వాలంటీర్ల సర్వీసులను రెగ్యులర్‌ సర్వీసులుగా పరిగణించి ఆర్ధిక ప్రయోజనాలు, పెన్షన్‌ సదుపాయాలు కల్పించడం జరిగింది. ఉపాధ్యాయుల నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లను సజావుగా అమలు జరిపించేందుకు నిరంతరం అధికారాలతో సంబంధాలు కొనసాగించేవారు. ఆ విధంగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో సామాజికన్యాయం సాధన కోసం తన ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తూ స్కూల్‌ టీచర్స్‌ ఫెసరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ ఉపాధ్యక్షులుగా, 2008లో చైనాలో పర్యటించి ఆ దేశంలో విద్యాభివద్ధిని పరిశీలించారు. 2010లో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన 'ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య' మహాసభలో భారతదేశ ఉపాధ్యాయ ఉద్యమ ప్రతినిధిగా పాల్గొని వివిధ దేశాల్లో విద్యారంగం, ఉపాధ్యాయుల స్థితిగతులను తెలుసు కోవడం జరిగిందని వివరించారు.


యాక్టర్‌ కాలేక టీచర్‌ అయ్యా...
ఆటలు, సాంస్కతిక కార్యక్రమాల్లో అనుభవాలు గురించి చెబుతూ... 'చెప్పాలంటే చాలా వుంది, కానీ సినిమా యాక్టర్‌ కాలేక పోయాను' అని అసంతప్తి వ్యక్తం చేశారు. ''చదువుకునే రోజుల్లో ఆటలు (వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌) బాగా ఆడేవాడిని, చాలామందిలాగే సినిమాల పిచ్చి కూడా వుండేది. మా మాలపల్లి మధ్యలో ఉమ్మడిగా వుండే పెద్ద రాతి రోలు మీద కూర్చుని రాత్రి పొద్దుపోయే దాకా సినిమా పాటలు పాడేవాడిని. పిల్లలు, పెద్దలు అందరు చేరి ప్రోత్సహించేవారు. జానకీపురం హైస్కూల్లో, సిరిపురంలో ఇంటర్మీడియెట్‌ చదివే రోజుల్లో నాటికలు, నాటకాల్లో నటించేవాడిని. 'సమాధి కడుతున్నాం చందాలివ్వండి', 'ముసుగు మనిషి', 'ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌', 'మంచం మీద మనిషి', 'రక్తాశ్రువులు' తదితర నాటకాల్లో ప్రధానపాత్రల్లో నటించాను. అన్నీ సామాజిక చైతన్యం కల్పించేవే. రక్తాశ్రువులు నాటకంలో నేను హీరో పాత్రలో నటిస్తే హీరోయిన్‌ పాత్రలో మా ఊరి పెద్ద నాయకులు యనమద్ది సత్యం గారి తమ్ముడు స్వామి నటించారు (వారు బ్యాంక్‌ ఆఫీసరుగా పనిచేసి రిటైరై ఖమ్మంలో వుంటున్నారు). మాలోళ్ళ పిలగాడు, కమ్మోరి అబ్బాయి ప్రేమికుల పాత్రల్లో నటించడం భలేగుంది అని జనం మెచ్చుకునేవారు. మాది వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టుల గ్రామం కావడం వలన అది సాధ్యమైంది. సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ సాంస్కతిక కార్యక్రమాల్లో నేను నటించిన 'ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌', 'మంచం మీద మనిషి' నాటికలకు మంచి ప్రశంసలు లభించినవి. ఆరోజుల్లో (1973-76) సినిమాలకు నూతన నటీనటులు కావలెను అనే ప్రకటనలు పత్రికల్లో వస్తుండేవి (దాసరి నారాయణరావు అందరూ కొత్త నటులతో నిర్మించిన 'స్వర్గం నరకం' సినిమా అప్పుడు వచ్చిందే). అవిచూసి మా స్టూడెంట్స్‌ సెల్ఫ్‌ మేనెజ్డ్‌ హాస్టల్లోని నా సహాధ్యాయులు రత్నకుమార్‌, ప్రసాద్‌, రాములు, వెంకటరత్నం తదితరులు నన్ను ప్రోత్సహించేవారు. ''దానధర్మాలు'' అనే సినిమా కోసం నేను పంపిన ఫోటోలు చూసి సెలక్షన్‌ టెస్టుకి రమ్మని పిలుపు వచ్చింది. విజయవాడ గాంధీనగర్‌లోని ఒక పెద్ద హోటల్‌ గదిలో ఆ సినిమా కోసం రికార్డ్‌ చేసిన 'నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి ముత్యాల ముగ్గులు వేద్దామా?' అనే పాట వినిపిస్తున్న డైరెక్టర్‌ వీ.ఆర్‌. నల్లమిల్లి గారిని కలిశాను. టెస్టులో సెలక్ట్‌ అయినా అది కో-ఆపరేటివ్‌ సిస్టంలో తీస్తున్న సినిమా అని, రూ.25 వేలు ఇస్తే సెకండ్‌ హీరో పాత్రలో నటించే అవకాశం ఇస్తామన్నారు. అంత స్తోమతు లేనందున ఆ అవకాశాన్ని వదిలేశాను. అలాంటి పిలుపే 'కవిత' సినిమా కోసం వచ్చినా ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు. ఆ విధంగా ఎంతో ఆకాంక్ష వున్నా సినిమా యాక్టర్‌ కాలేకపోయాను. హైస్కూల్లో మరియు కాలేజీల్లో చదివే రోజుల్లో చీకటిపడే దాకా బాల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆటలు ఆడే వాళ్లం. ఆటల పోటీలు, టోర్నమెంట్స్‌లో పాల్గొని సర్టిఫికెట్లు కూడా పొందాను. నేను పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులతో మరియు సహఉపాధ్యాయులతో కలిసి ఎంతో సరదాగా ఆడే వాళ్లం. ఉపాధ్యాయ ఉద్యమంలో బిజీ అయిన తర్వాత ఆట, పాటలు, సాంస్కతిక కార్యక్రమాలకు దూరం కావాల్సి వచ్చింద''ని ఆనాటి అనుభవాలు పంచుకున్నారు.


అన్ని రంగాల్లో...
అణగారిన జాతుల అభివద్ధికి, సామాజిక న్యాయం సాధనకు మహనీయుడు అంబేడ్కర్‌ పునాదులు వేసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితుల పరిస్థితి దయనీయంగానే వుంది. అంతర్గత నాయకత్వం ఎదగ కుండా ఏ జాతి, ఏ వర్గమూ అభివద్ధి చెందలేవని మహనీయులు మార్క్స్‌, లెనిన్‌ చేసిన బోధనలు సత్యం. అందువలన అణగారిన కులాల నుండి అన్నిరంగాల్లోకి నాయకులుగా ఎదగాలని నారాయణ సూచించారు. 'మట్టికి పోయినా ఇంటోడే పోవాల' అనే సామెత తెలిసిందే. ఒక పుష్కరకాలంలో ఉపాధ్యాయ ఉద్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ టీచర్లకు సాధించిన ప్రయోజనాలు చెప్పుకోదగినవే. అయితే అవన్నీ నా ఒక్కడి వల్లనే సాధ్యం కాలేదు. అందరితో కలిసి పనిచేయడం వలనే సాధ్యం అయింది. అందరూ బాగుంటేనే అందులో మనం బాగుంటామనే విషయాన్ని గుర్తించాలి. జనాభాలో పదిహేను శాతంగా వున్న దళితుల సమస్యలు అందరి మద్దతు లేదా మెజారిటీ సపోర్ట్‌ వుంటేనే పరిష్కారం కాగలవు. కులాలు, మతాలకు అతీతంగా అందరి మద్దతు కూడగట్టేందుకే నాయకులు కషి చేయాలి. ఆ పని చేయడానికే అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో దళితులు నాయకులుగా ఎదగాలి. ఎదిగిన నాయకులు దళితులతోపాటు అందరి అభిమానాన్ని చూరగొనాలి. యావత్‌ భారతీయులు ఆమోదించిన రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నుండి నేర్చుకోవలసిన స్ఫూర్తి అదే.''


బాబాసాహెబ్‌ మార్గంలోనే . . .
ఉద్యోగంలో వుండి ఉద్యమాల ద్వారా చేసిన కషి మరువ రానిది. అంత మంచి అనుభవం వున్న మీరు రిటైర్‌ అయిన తర్వాత ఏమి చేస్తున్నారని అడిగితే వారు చెప్పిన విషయాలు: ''యాక్సిడెంటులో భార్య చనిపోయిన విషయం యింతకు ముందే చెప్పాను. చావు నుండి బయట పడిన నేను మూడు నెలలు బెడ్‌ మీదనే వుండి కోలుకునే సరికి రిటైర్‌ అయ్యాను. పని చేయగలిగే ఓపిక, వయసు వున్నా తోడు మనిషి లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. 2017 మే 7న మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నాకు అనుభవం వున్న సమాజానికి అవసరమైన విద్యారంగంలోనే మళ్లీ చురుగ్గా పనిచేస్తున్నాను. పేరేంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా వుండి చదువుల విషయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై కషి చేస్తున్నాను.


సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌ అండ్‌ సర్వీస్‌ (సిఈఎస్‌ఎస్‌) బ్యానరుతో విద్యారంగ విధానాలు, పథకాలు, ప్రణాళికలు, సిలబస్‌, పాఠాలు మున్నగు విషయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయడం జరుగుతోంది. ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపుపై వివిధ దశాల్లో ఉదమ్యం చేయడం తోపాటు న్యాయపరంగా విజయం సాధించడం జరిగింది. కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల పిల్లలకు మెరుగైన విద్యావకాశాల కొరకు పని చేస్తున్నానని'' చెప్పారు. దేశంలో పెరుగుతున్న కార్పోరేటీకరణ, కాషాయీకరణ విధానాల వలన బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే పరిస్థితులు పెరుగుతున్నవి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో సామాజిక న్యాయం సంరక్షణ కోసం జరిగే ఉద్యమాల ఉధృతికి నా వంతు కృషి చేస్తున్నానని'' నాగటి నారాయణ తెలియ జేశారు. నిరుపేద దళిత కుటుంబం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగటి నారాయణ జీవితం యువతకు మార్గదర్శనం చేస్తుందని ఆశిస్తున్నాం...


బి.గంగాధర్‌, ఎడిటర్‌ & పబ్లిషర్‌
దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక
మొబైల్‌ నెం.94900 98902 

Please Subscribe and support Dalitha, Bhahujana Monthly Magazine

January 2020 Magazine

January 2020 Magazine