బహుజనం లోపించిన స్త్రీవాదం

image5

అంటరాని మహిళల ఉద్యమాలు, తునికాకు పోరాటాలు, మహిళలు చేసిన మద్దూరు లాంటి భూపోరాటాలు, బీడీ కార్మిక ఉద్యమాలు, కూలి పోరాటాలు ఫెమినిస్టులకు అప్రస్తుతాలైనవి. అంతర్జాతీయ తెల్లజాతి స్త్రీ విముక్తులు, వారి ఉద్యమ చరిత్రలను ప్రముఖంగా ప్రచురించారు. 'మాకు గోడలు లేవు, గోడల్ని పగలగొట్టడమే మా పని' అని శ్రీ శ్రీ నినాదాన్ని అందిపుచ్చుకున్న ఫెమినిస్టులు కులగోడలు, శ్రమగోడలు, దొర దొర్సాని గోడలు, మత గోడలు, జోగినీ దురాచారాలలో చదువుల్లేక మానవ హక్కుల్లేక బందీలై బాంచలకు బాంచలైన బహుజన మహిళల ప్రత్యేక గోడల్ని అంటుకోలేదు.

 పాశ్చాత్య దేశాల్నించి భారతదేశానికి వచ్చిన అనేక యిజాల్లో ఫెమి నిజం ఒకటి. యిది పాశ్చాత్య దేశాల్లోని ధనిక తెల్లజాతి స్త్రీల యిజమ్‌. 1970 దశకంలో పాశ్చాత్య దేశాల్లో పిత స్వామ్య వ్యవస్థపై స్త్రీల పోరాటాలతో, వారి సాహిత్యాలైన 'ది ఫెమినైన్‌' 'సెక్సువల్‌ పాలిటిక్స్‌' లాంటి సాహిత్వాలతో భారతదేశ ధనిక చదువుకున్న అగ్రకులాల స్త్రీలు ప్రభావితులయ్యారు. కేవలమ్‌ పిత స్వామిక అణచివేతల్ని పెత్తనాల్ని కుటుంబ లైంగిక హింసల్ని నిరసించిన చైతన్యం స్త్రీవాదంగా భారతదేశంలో ఉద్భవించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమాల్లోని అగ్రకుల పురుషుల్తో సమానంగా విద్యాధికులైన ధనిక, మధ్యతరగతి సీమాంధ్ర అగ్రకులాల స్త్రీలు, స్త్రీవాదాన్ని అందుకొని తమని ఫెమినిస్టులుగా ప్రకటించుకున్నారు. సాంఘికంగా తమ కులాల పురుషుల్తో విద్య, ఉద్యోగం వంటి కొన్ని రంగాల్లో సమానంగా వున్నయి. స్త్రీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో జెండర్‌ స్పహా పెంచగలిగారు. పీవోడబ్య్లూ, స్త్రీశక్తి సంఘటన, ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌, మహిళా విద్యార్థి వేదిక వంటి సంఘాలేర్పాటు చేసి స్త్రీల (అగ్రకులాల) శరీరాల చుట్టూ అల్లబడిన మిత్‌, కుటుంబాల్లో వుండే అప్రజాస్వామిక విలువలు, జరిగే హింసల్ని, పితస్వామిక అణచివేతల్ని ప్రశ్నించారు. స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ధనిక, మధ్యతరగతి, అగ్రకులాల స్త్రీల నుంచి వచ్చింది. వీరు వివిధ ప్రాంతాల, కులాల, మతాల అస్తిత్వాల వైవిధ్యాల్ని వైరుధ్యాల్ని పక్కకు నెట్టి స్త్రీలంతా ఒక్కటే, భిన్నత్వాలు లేవు అనే అప్రజాస్వామికాల్ని సమాజంలో, సాహిత్యంలో ప్రచారం చేయడం జరిగింది, జరుగుతున్నది.
పాశ్చాత్య దేశాల్లోని తెల్లజాతి స్త్రీలు ఫెమినిజాన్ని ఆక్రమించుకొన్నట్లు ఇక్కడ అగ్రకులాల స్త్రీలు, స్త్రీవాదాన్ని తమ పరధిలోనికి తెచ్చుకున్నరు. నల్లజాతి మహిళల అస్తిత్వాలు భిన్నమైనవి అని తెలిసి కూడా తెల్లజాతి ధనిక స్త్రీలు తమ వర్ణ దురహంకారాన్ని ప్రదర్శించినట్లే ఇక్కడి అగ్రకుల 'స్త్రీవాదం' ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల సమస్యల్ని ఎజెండా కాకుండా కప్పేసిందని బహుజన కులాల మహిళలు ప్రశ్నిస్తున్నారు. కులం అగ్రవర్ణం కావడం, జాతీయోద్యమములో తమ మగవాళ్ళు అందించిన సంస్కరణ ఫలితాల వల్ల ఆధిపత్య కులాల స్త్రీలకు నిమ్న కులాల మహిళల కంటే మెరుగైన జీవితం, చదువులు, సంపదలు ఒనగూరినయి. ఆధిపత్య కుల మగ ప్రపంచం వారి స్త్రీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని కొంత వరకైనా అందుబాటులో వుంచింది. దురాచారాల్ని సంస్కరించింది. చదువు నేర్పింది. తమ కనుసన్నల్లో నుంచి కనుమరుగు కాకుండా, కంట్రోలు తప్పకుండా ఉద్యమాలు చేయించింది. ఉద్యోగాలు చేయించింది, చట్టసభలకు పంపింది. యీ వెసులుబాటుతో ఆధిపత్య కులాల స్త్రీలకు తమ మగవాళ్ల చేతిలో వున్న ప్రచురణ సంస్థలు, అకాడమీలు, మీడియా వంటి సంస్థల వల్ల తమ సాహిత్య విస్తతిని పెంచుకునే అవకాశా న్నిచ్చింది. కవిత్వం, కథ, నవల, సిద్ధాంత వ్యాసాలు, వారి సమస్యల్ని వస్తువుగా ఎజెండాగ చేసుకొన్న సాహిత్యం తెలుగులో కోకొల్లలుగా వచ్చింది- ఫెమినిస్టు సాహిత్యంగా. మిగతా రంగాల్లోకి కూడా వీరు విస్తరించగలిగారు. పత్రికల్లో ప్రత్యేక స్త్రీల పేజీలు, మహిళా కాలమ్స్‌, మహిళా పత్రికలు, చానల్లు ఏర్పాటు చేసుకోగలిగారు.
స్త్రీలంతా ఒక్కటే, వారి సమస్యలన్ని, బాధలన్ని వొక్కటే, 'మాకు గోడలు లేవ'ని నినదిస్తున్న స్త్రీవాద సాహిత్యం సమాజములో ఉత్పత్తి శక్తులుగా వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి మహిళల కుల హింసలని, శ్రమ దోపిడిని, దొర దొరసాని, మగ పెత్తనాల్ని అవమానాల్ని, వారి కుల జెండర్‌ సమస్యల్ని, తమ సాహిత్యంలో ఏ మేరకు భాగస్వామ్యం కల్పించ గలిగారు? అట్లా తమ సామాజిక బాధ్యతలను ఎంతవరకు ప్రకటించుకున్నారు? అనేది చర్చించడం యీ వ్యాసం ప్రధాన ఉద్దేశం. కోస్తాంద్ర ఫెమినిస్టులు వేసిన మొదటి పుస్తకం 'మనకు తెలియని మన చరిత్ర'(1986). ఏడుగురు సంపాదకుల్లో ఒక్క దళిత మహిళ కనిపించదు. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల సజీవ చరిత్రగా వేస్తున్నామని చెప్పి ఆధిపత్య కులాల స్త్రీల (ముగ్గురు, నలుగురు బీసీ మహిళలు మినహా) సజీవ చరిత్రల్నే చరిత్రీకరించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గోన్న అంటరాని, ఆదివాసి మహిళల సజీవ చరిత్రల్ని చీకటి చేయడం జరిగింది. వీరు వేసిన మొదటి అడుగే అంటరాని మహిళల్ని, ఆదివాసి మహిళల్ని విస్మరించడంగా మొదలు కావడం దురదష్టకరం. 1953లో ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ 'ఆంధ్ర కవయిత్రుల చరిత్ర'లో కనబరిచిన కుల జెండర్‌ వివక్షలకు భిన్నమైన సామాజిక చైతన్యాలేవీ, యీ వామపక్ష భావాలు కలిగిన అగ్రకుల స్త్రీలు అందించలేకపోయారు. యిప్పటికి స్త్రీవాద సాహిత్యంలో యివే ధోరణులు కొనసాగుతున్నయి.
1989లో...'ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌' పేరుతో ప్రచురించిన 'మాకు గోడలు లేవు' ఫెమినిజం గురించిన పరిచయంగా వ్యాస సంకలనం వచ్చింది. వ్యాస అంశాలు (1) ఫెమినిజం అంటే ఏమిటి? (2) అంతర్జాతీయ స్త్రీ విముక్తి ఉద్యమ చరిత్ర (3) మూడవ ప్రపంచ దేశాల పోరాటాల్లో స్త్రీల పాత్ర (4) ఫెమినిస్టు అవగాహన. యీ అంశాల్లో స్థానికంగా వున్న నిమ్నకులాల మహిళల అనేక వీరోచిత పోరాటాలు వీరికి కనబడలేదు. గ్రామాల్లో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బహుజన కులాల మహిళల పోరాటాలు, సింగరేణి కాలరిస్‌లో బాయిదొరల యిండ్లల్ల అకత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కాల్పులకు గురైన అంటరాని మహిళల ఉద్యమాలు, తునికాకు పోరాటాలు, మహిళలు చేసిన మద్దూరు లాంటి భూపోరాటాలు, బీడీ కార్మిక ఉద్యమాలు, కూలి పోరాటాలు ఫెమినిస్టులకు అప్రస్తుతాలైనవి. అంతర్జాతీయ తెల్లజాతి స్త్రీ విముక్తులు, వారి ఉద్యమ చరిత్రలను ప్రముఖంగా ప్రచురించారు. 'మాకు గోడలు లేవు, గోడల్ని పగలగొట్టడమే మా పని' అని శ్రీ శ్రీ నినాదాన్ని అందిపుచ్చుకున్న ఫెమినిస్టులు కులగోడలు, శ్రమగోడలు, దొర దొర్సాని గోడలు, మత గోడలు, జోగినీ దురాచారాలలో చదువుల్లేక మానవ హక్కుల్లేక బందీలై బాంచలకు బాంచలైన బహుజన మహిళల ప్రత్యేక గోడల్ని అంటుకోలేదు.
1993లో 'నీలి మేఘాలు' స్త్రీవాద కవితా సంకలనం ఓల్గా, వసంత కన్నాభిరాన్‌ సంపాదకత్వంలో వచ్చింది. ఈ సంకలనంలోని కవయిత్రులంతా దాదాపు కోస్తాంధ్ర అగ్రకులాల కవయిత్రులే. కవితా వస్తువులు కూడా తమ అగ్రకుల స్త్రీల చుట్టు పరిమితమైన పర్యావరణ అంశాలే. (ఇందులో ఒక తెలంగాణ ఆధిపత్య కులం, కోస్తాంధ్ర నుంచి ఒక ముస్లిం, ఒక దళిత కవయిత్రి కనబడ్తారు) సంపాదుకుల్లో ఒకరు... ''స్త్రీగా రాయడమంటే...'' అని అంటూ ఏ స్త్రీగా రాయడమో విశ్లేషించలేదు. 'స్త్రీ అంటే చదువుకున్న కోస్తాంధ్ర అగ్రకుల స్త్రీ' అనే ఒక్క అస్తిత్వమేనా? ఈ స్త్రీల చుట్టూతా అల్లబడిన కుటుంబ హింస, లైంగిక హింస, మగాధిపత్యం, బాడీ పాలిటిక్స్‌ గురించిన రాజకీయ అవగాహనలే ఈ సంకలనంలోని వస్తువులు. ఇట్ల నిమ్నకులాల 'కుల జెండర్‌' అస్తిత్వాలు, వాటి రాజకీయాలు చర్చలోకి, వెలుగులోకి రాకుండా స్త్రీవాద సాహిత్యం కషి చేసింది.
1990లో 'కఠోర షడ్జమాలు' ఫెమినిస్టు వ్యాసాలు వసంత కన్నాభిరాన్‌ వెలువరించారు. యీ వ్యాసాల్లో 'నా స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అనే హిందూ మనువాదాన్ని గానీ, మనిషిని మనిషిగా చూడని కులవ్యతిరేకతలు గానీ కనిపంచవు. 1995లో 'సరిహద్దులు లేని సంధ్యలు' కల్పనా కన్నాభిరాన్‌, ఓల్గా, వసంత కన్నాభిరాన్‌ సంపాదకత్వంలో వచ్చింది. ఇది స్త్రీల సంఘాల పరిచయ వ్యాసాల సంకలనం. ఫెమినిస్టు రాజకీయాలు, కార్యాచరణ, ప్రశ్నలతో ఫెమినిస్టు సిద్ధాంత వ్యాస సంకలనంగా వచ్చింది. ఇందులోనూ పుర్తిగా అగ్రవర్ణ స్త్రీల కుటుంబాలు, లైంగిక అణచివేత, పితస్వామ్య పెత్తనాల చుట్టూ చర్చ సాగింది.
'తొలి వెలుగులు' 2003లో స్త్రీవాద సిద్దాంత వికాసంగా ఫెమినిస్టు థియరీగా ఓల్లా వేశారు. అమెరికా, యూరప్‌ దేశాల శ్వేతజాతి స్త్రీలైన ఎబిగిల్‌ ఆడమ్స్‌, జుడిత్‌, మేరి ఉల్‌ స్టోన్‌ ఫ్రాన్సిన్‌ రైట్‌, జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ వంటివారు రూపొందించిన స్త్రీవాద సిద్దాంతాలని, వారి దక్పథాల్ని, చర్చల్ని యథాతథంగా దిగుమతి చేసిన సిద్ధాంతంగా ఈ వ్యాస సంపుటి వుంది. మత చర్చ కూడా బైబిల్‌ చుట్టు ఉన్న మిత్‌, చర్చిని గూర్చిన అంశమేగానీ హిందూ మతం గూర్చిన చర్చ లేదు. 'స్త్రీలు-ఆర్థిక ప్రపంచం' వ్యాసంలో 'స్త్రీలు చేసే యింటిచాకిరికి వున్న ఆర్థిక విలువ ఎంతైనప్పటికి వాళ్లు దానిని పొందలేరు' అనేది యింటి చాకిరి చేసే అగ్రాకులాల మధ్యతరగతి స్త్రీల ఆర్థికంగా చెప్పారు. మరి యింటి చాకిరీ, బైటి చాకిరిలో, అవ్యవస్తీకతరంగాల్లో ఎట్టి చేసే అణగారిన మహిళల చాకిరికి వున్న ఆర్థిక విలువల మాటేంటి? 'యింటి చాకిరికి జీతం లేని'తనాలే ఎజెండా అయింది కాని యింటి చాకిరితోపాటు బైటి చాకిరీకి కూడా జీతం లేని కుల అణచివేతన్ని గూర్చిన విలువల మాటేంది? 'మాతత్వం వల్ల పనిచేయలేనివారిగా ముద్రవేసి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తున్నారు' సరే, కాని బహుజన కులాల మహిళలు యింకో నిమిషానికి ప్రసవిస్తారనేదాకా సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటూ... పుర్సతు లేని కుల జెండర్‌ హింసల విషయం విస్మరించారు.
2009లో ' స్త్రీవాద రాజకీయాలు -వర్తమాన చర్చలు' రమా మెల్కోటె, కె.సజయ సంపాదకులుగా, 'అన్వేషి-రీసెర్చి సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ స్టడిస్‌' వేసింది. వర్తమాన చర్చల్లో బహుజన మహిళల ప్రశ్నలు, అస్తిత్వాలు చర్చకు రాకపోవడమనే రాజకీయమే వుంది. అంశాలన్ని ఆధిపత్య స్త్రీల చుట్టున్న రాజకీయ విశ్లేషణలే. ఈ వర్తమానచర్చలో ఒకే ఒక అంటబడని మహిళకు తన జెండర్‌ పాలిటిక్స్‌ను చర్చించే అవకాశం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ వ్యాసాల్లో ఎక్కువగా ఇండియన్‌ ఫెమినిస్టులు వీణామజుందార్‌, ఇందు అగ్నిహౌత్రి, పార్దా చటర్జి, ఊర్వశి బుటాలియ, వందనా సోనాల్కర్‌, ప్లేవియా ఆగేస్‌, బీనా అగర్వాల్‌ వంటి తెలుగేతర ఇండియా ఫెమినిస్టులు వర్తమానంలో స్త్రీవాద ఉద్యమ చర్చలు చేశారు. అవన్నీ అగ్రకుల స్త్రీల ద ష్టికోణాల నుంచే విస్తతంగా చర్చించ బడినాయి. కానీ ఉత్పత్తి కులాలైన బహుజన కులాల మహిళల చర్చే లేదు.
స్త్రీవాద కథలు, నవలలు కూడా తెలుగులో విస్తతంగానే వచ్చినయి. అవన్నీ కూడా కోస్తాంద్ర ఆధిపత్య కుల జెండర్‌ దష్టికోణాలే. దీన్నంతా స్త్రీలందరి వాదంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అణగారిన కులాల జెండర్‌ సమస్యల్ని అప్రస్తుతం చేయడం. అవాచ్యం చేయడం జరిగింది. కులసమాజంలో పురుషులంతా ఒక్కటి కానట్లే స్త్రీలు కూడా ఒకటిగా లేరు. పురుషాధిక్యత కూడా అణగారిన కుల మహిళల మీద, ఆధిపత్య కులాల స్త్రీల మీద ఒకే తీరుగా లేదు. యిది ఒప్పుకోడానికి, తద్వారా కార్యాచరణకి స్త్రీవాదులు సిద్దంగా వున్నట్లు కనిపించరు. ఉత్పత్తి కులాల స్త్రీల భాషని బూతనీ, రోతనీ, తెలంగాణమనీ, ఆర్థం కావట్లేదని, రాసేవాల్లే లేరని, వారి రచనల్ని ఆధిపత్య కుల రచయితలు చీకటిలోకి నెట్టినారు. ఆ దారిలోనే స్త్రీవాదులు తమ సంకలనాల అగ్రహారాలకి బహుజన మహిళల రచనల్ని అంటనివ్వలేదు. వీరు చెప్పిన పై కారణాలు ఎంత అబద్దాలో దళిత మహిళల సాహిత్య సంకలనం 'నల్లపొద్దు' నిరూపించింది.
భారతదేశ కులపురాణాలన్నీ సామాజిక సాంస్కతిక అణచివేతల్నించి వచ్చినవే. మేజారిటీ ప్రజల్లో కుల పురాణాలు సాహిత్య ప్రక్రియగా, సాంస్కతిక కళారూపాలుగా కొనసాగు తున్నప్పటికీ యిప్పటిదాకా అగ్రకుల కమ్యూనిస్టులుగానీ, ఫెమినిస్టులుగానీ కుల పురాణాల్లోని సామాజిక పోరాట భావజాలాన్ని, వస్తువుని, నాగరికతల్ని, యితివత్తాల్ని స్ఫూర్తిగా తీసుకోకపోడాన్ని ఆధిపత్య కుల అణచివేతలుగానే అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టు సాహిత్యంలోనూ, ఫెమినిస్టు సాహిత్యంలోనూ శ్రీశ్రీ 'మహాప్రస్థానం' నుంచి ఓల్గా 'మణ్మయ నాదం' దాకా పరిశీలిస్తే ఆధిపత్య పురాణాల్లోని ఆధిపత్య ప్రతీకల్ని పాత్రల్ని (సీత, ఊర్మిళ, అహల్య) స్వీకరించారే తప్ప అణగారిన ప్రతీకల్ని పాత్రల్ని(తాటకి, శూర్పణఖ) అంటుకోలేకపోయారు. స్త్రీవాదులు కుల, హిందూమత అణచివేతల గురించి ఎక్కడా చర్చించలేదు. యీ చర్చ చేస్తే తమ కులాల పురుషుల్తో పాటు తాము కూడా బహుజన మహిళల్ని అణచివేస్తున్న తీరు బహిర్గతమవుతుంది. అందుకే కులం లేని పాశ్చాత్య ధోరణిలోనే ఫెమినిస్టులు చర్చిస్తారు.
1934లోనే 'కుల నిర్మూలన' గ్రంథంలో అంబేడ్కర్‌ 'కుల వ్యవస్థ శ్రమ విభజననే కాదు, శ్రామికుల మధ్య విభజనను కూడా సష్టించింద'ని విశ్లేషించాడు. దీన్నంతా పక్కకు పెట్టి కమ్యూనిస్టు అగ్రవర్ణ పురుష నాయకత్వం భారతదేశ కుల వ్యవస్థకు యిమడని వర్గవ్యవస్థను దిగుమతి చేసుకొని కులాలుగా వున్న శ్రామిక సమూహాల నన్నింటిని 'కార్మికవర్గం' గా కట్టగట్టి వారిమీద తమ సామాజికాధిపత్యాల్ని కొనసాగిస్తూ కింది కులాల నాయకత్వాల్ని కిందనే అణచిపెట్టారు. తమ మగవాళ్ళ అడుగు జాడల్లోనే భారత స్త్రీవాదులు దేశీయ అణగారిన మహిళా విముక్తికి సరిపోని పాశ్చాత్య శ్వేతజాతి స్త్రీలవాదాన్ని దిగుమతి చేస్కున్నారు. అణగారిన కులాల మహిళా ప్రపంచం సామాజిక ఉత్పత్తిలో వున్న ప్రపంచం. అగ్రకుల స్త్రీలు సామాజిక ఉత్పత్తిల ో లేని చిన్న సమూహం. బహుజన మహిళా ప్రపంచం విస్తతమైంది. అట్లనే ఫెమినిస్టు సైద్దాంతిక ఆచరణ బహుజన స్త్రీల మీద నాయకత్వ పెత్తనాల్ని, అణచివేతల్ని చలాయిస్తూ 'భారత ఫెమినిజం'గా చలామణీ అవుతున్నది. దొర్సానుల ఫెమినిజం ప్రజాస్వామీకరించ బడాలంటే మెజారిటీగా (85శాతం) వున్న బహుజన కులాల మహిళావరణాలను, చరిత్రలు, సంస్కతులు, కళలు, సాహిత్వాలను గుర్తించి వెలికితీయాల్సిన అవసరము, బాధ్యత అందరి పైన వుంది.  
- జుపాక సుభద్ర
ప్రముఖ రచయిత, 

ప్రభుత్వ అదనపుకార్యదర్శి, పంచాయితీరాజ్‌ శాఖ
మొబైల్‌ నెం.9441091305

Editorial Board