కార్మికవర్గ దృక్పథంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

Cover story

అంబేడ్కర్‌ కార్మిక సంక్షేమాన్ని, అంటరానికులాల సంక్షేమాన్ని తన ప్రధాన అజెండా ఎంచు కున్నాడు. అది బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు, హిందూమత జాతీయ పెట్టుబడిదారులకు అస్సలు నచ్చలేదు. ఈ దేశంలో కార్మికవర్గం మీద, అంటరాని కులాల మీద దోపిడీ పోవటం గాంధీకి అసలు ఇష్టం లేదు. అందుకే భారత పెట్టుబడిదారీ వర్గం, బ్రిటిష్‌ పెట్టుబడిదారుల తోపాటు భారత కమ్యూనిస్టులు కూడా అంబేడ్కర్‌ పట్ల పూర్తి కులవివక్షతను ప్రదర్శించాయి. భారత కమ్యూనిస్టులు తమ శత్రువెవరో, మిత్రువెవరో తేల్చుకోకుండా పూర్తి కులఉన్మాదంలో కురుకుపోయారు.
మేడే ఇదొక శ్రామికవర్గాల ఐక్యతను తీసుకవచ్చేరోజు.. నిర్దిష్టమైన పనిగంటల కోసం, అమెరికన్‌ సామ్రాజ్యావాద పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మహౌన్నతమైన పోరాటం నడిపి కనీసం కార్మిక హక్కులను సాధించిన రోజు, ప్రపంచ కార్మికవర్గం తమదైన రాజ్యం కోసం పరితపిస్తూ అత్యంత ఉత్సాహాంగా జరుపుకునే పోరాటదినమే మేడే...
భారత దేశంలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీలో 1923లో అప్పటి ప్రముఖ మార్క్సిస్ట్‌ సింగారవేలు చెట్టియార్‌ నాయకత్వం లో మొట్టమొదటిసారిగా మేడేను నిర్వహించాడు. ఆ తరువాత 1927 నుండి క్రమం తప్పకుండా మేడేని ఇండియాలో జరుపు తున్నారు. కానీ ఈ దేశంలో కార్మికవర్గానికి నిజమైన ఆత్మ బంధువేవరో ఈ మేడే సందర్భంగా కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రపంచంలో కారల్‌మార్క్స్‌ను అంబేడ్కర్‌ అర్ధం చేసుకున్నంతగా మరెవరూ అర్ధం చేసుకోలేదని, చివరకి నిత్యం ఆయన నామమే జపించే ఇండియన్‌ మార్క్సిస్టులు కూడా మార్క్స్‌ను అంతగా అర్ధం చేసుకోలేదని నా అభిప్రాయం. వీళ్లిద్దరి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. యూరప్‌లోని కార్మికరంగం పట్ల పెట్టుబడిదారీ వర్గం వ్యవహరించిన వికత రూపాలను గమనించవచ్చు. ఆయన ఉన్నత చదువుల కోసం లండన్‌కు రావటం. లండన్‌ యూనివర్సిటీలోని గ్రంథాలయం లో ఉన్న బుక్స్‌ అన్నీ చదవటం, అత్యంత పేదరికంను అనుభవించడం, తన భార్యాబిడ్డలను కోల్పోవడం వంటి ఘట్టాలన్నీ కూడా అంబేడ్కర్‌ జీవితంలో జరిగాయి.
అంబేడ్కర్‌ కూడా ఈ దేశంలో అత్యంత పేదరికంలో పుట్టడం, కులవివక్షతో సర్వస్వం కోల్పోయిన పీడిత ప్రజానీకానికి రాజ్యాంగ రక్షణలు కల్పించటానికి నిరంతరం పోరాటం చేసాడు. మార్క్స్‌ ఏ విధంగా అయితే పెట్టుబడిదారీ విధానాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడో అంబేడ్కర్‌ కూడా అంతే తీవ్రంగా పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించ టమే కాకుండా, అదనంగా ఇండియాలో ఉన్న కులవ్యవస్థను కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ ఇద్దరు దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. తమ బిడ్డల్ని కోల్పోయారు. భారత దేశంలోనే ఉన్నత చదువులు చదువుకున్న విజ్ఞానవంతుడు, మార్క్స్‌లాగా లండన్‌ లైబ్రరీ బుక్స్‌ అన్ని అవపొసన పట్టిన మహామేధావి, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ చేత కొనియాడబడిన ఒకేఒక భారతీయుడు. ఈ ఇద్దరు కూడా ప్రపంచ పెట్టుబడిదారీ విధానాల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్మాణం చేశారు. కొన్ని సందర్భా ల్లో విజయాలు కూడా సాధించారు.
కానీ భారత కమ్యూనిస్టులు మార్క్స్‌ను గుర్తించినట్లు, అంబేడ్కర్‌ గారిని ఎందుకు గుర్తించలేక పోతున్నారో సరైన సమాధానం ఇప్పటికి వారి నుండి రావటం లేదు. ఈ దేశానికి మొదటిసారిగా 1920-25ల్లో కమ్యూనిస్టు పార్టీ వచ్చిదంటారు. కానీ ఈ పార్టీ ఎప్పుడు వచ్చిందో నిర్దిష్టంగా చెప్పలేనివాళ్ళు, ఈ దేశంలో ఏ సమస్యలున్నాయో నిర్ధిష్టంగా చెప్పగలరా అనే అనుమానం సహజంగానే వస్తుంది. కానీ ఈ దేశ భౌగోళిక నిర్దిష్ట అంశాలపై ఇప్పటికి మన కమ్యూనిస్టు పార్టీలకు నిర్దిష్టమైన అవగాహన లేకపోవటం ఈ దేశ ప్రజలు చేసుకున్న దరిద్య్రం.
ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ వచ్చినప్పటి నుండి కనీసం ఓక దశాబ్దం పాటు ఏ పని పాట లేకుండా గాంధీ వెంటపడి పోయింది. అప్పటికే రష్యా విప్లవం విజయం సాధించింది. చైనా విప్లవం అంతిమ దశకు చేరుకుంది. లాటిన్‌ అమెరికా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభావం తారాస్థాయికి చేరింది. జర్మనీ, జపాన్‌ సామ్రాజ్యవాద దేశాలు కమ్యూనిజాన్ని తుద ముట్టించటానికి ఎప్పటికప్పుడు తన ప్రణాళికలు మార్చు కుంటున్నాయి. అదేక్రమంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం కూడా భారతదేశంలో కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి పెట్టుబడిదారీ సంక్షేమాన్నే ప్రధాన అజెండాగా తీసుకుంది. కానీ భారత రాజకీయరంగంలోకి ఓకేసారి ప్రవేశించిన గాంధీ, డా.బి.ఆర్‌.అంబేడ్కర్లలో భారత మీడియా, రాజకీయ నాయకులు పూర్తి వివక్షను చూపించారు. గాంధీని నెత్తిన పెట్టుకున్న భారత రాజకీయ నాయకులు, మీడియా అదే అంబేడ్కర్‌ని పాతాళానికి తొక్కటం ప్రధాన కర్తవ్యంగా తీసుకున్నారు, అందుకు ప్రధాన కారణం అంబేడ్కర్‌ కార్మిక సంక్షేమాన్ని, అంటరానికులాల సంక్షేమాన్ని తన ప్రధాన అజెండా ఎంచు కున్నాడు. అది బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు, హిందూమత జాతీయ పెట్టుబడిదారులకు అస్సలు నచ్చలేదు. ఈ దేశంలో కార్మికవర్గం మీద, అంటరాని కులాల మీద దోపిడీ పోవటం గాంధీకి అసలు ఇష్టం లేదు. అందుకే భారత పెట్టుబడిదారీ వర్గం, బ్రిటిష్‌ పెట్టుబడిదారుల తోపాటు భారత కమ్యూనిస్టులు కూడా అంబేడ్కర్‌ పట్ల పూర్తి కులవివక్షతను ప్రదర్శించాయి. భారత కమ్యూనిస్టులు తమ శత్రువెవరో, మిత్రువెవరో తేల్చుకోకుండా పూర్తి కులఉన్మాదంలో కురుకుపోయారు. కమ్యూనిస్టు పార్టీనైతే ఇండియాకి తీసుకొచ్చారు, కానీ పార్టీని ఎలా నడపాలో ఇప్పటికి చేతకాకపోవటంతో కులం విషకౌగిలి లో పార్టీని ఇరికించి లాక్కోలేక, పీక్కోలేక చచ్చిపోతున్నారు.
భారత కమ్యూనిస్టులు భారత కార్మికరంగానికి నాయకత్వాన్ని వహించడం మానేసి, గాంధీ గోచి పట్టుకొని అనుసరించటంలోనే తన పోరాట కాలం మొత్తం గడిచి పోయింది. ప్రపంచదేశాల కమ్యూనిస్టు ఉద్యమాలను అనుసరించి, భారత దేశంలో ప్రత్యామ్నాయ విప్లవ పోరాటాన్ని నిర్మించటాన్ని పూర్తిగా విస్మరించారు. పైగా కార్మిక - యాజమాన్యల మధ్య జరిగే వివాదాలలో అనవసరంగా గాంధీని ప్రవేశపెట్టి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం, కార్మిక సంక్షేమాన్ని పూర్తి అణిచివేయటం భారత కమ్యూనిస్టులకు బాగా అలవాటైపోయింది. అందుకే ఆనాడు పెట్టుబడిదారులందరు గాంధీకి పర్సులు గిఫ్టులుగా ఇచ్చేవారు.
రైతాంగం, కార్మికరంగం మొత్తం కూడా పోరాటాలకు దూరంగా పెట్టాలని గాంధీ నిర్ణయించుకున్నాడు. 1920 నాటికి అమెరికా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిపోయింది. కార్మికులందరు వీధుల్లోకి వచ్చారు. 1929-32 ప్రాంతంలో పదిహేను దేశాల్లో 85 లక్షలమంది కార్మికులు నిరంతరం సమ్మెలో మునిగిపోయి వున్నారు. 1930 నాటికి జర్మనీలో ఫాసిజం అవతరించి ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, స్పెయిన్‌, గ్రీక్‌, బాల్టిక్‌ వంటి దేశాల్లో ఫాసిజం వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో భారత్‌లో జాతియా ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ క్రమంలో 1930లో సూర్యసేన్‌ నాయకత్వంలో చిట్టగాంగ్‌ తిరుగుబాటులో కొంతమంది బ్రిటిష్‌ అధికారులను చంపేశారు. ఈ ఘటనతో బెంబేలెత్తిన గాంధీ తాను చేయబోయే దండి సత్యాగ్రహంలో కార్మికులు, రైతాంగం అస్సలు పాల్గొనవద్దని ఖరాఖండిగా చెప్పాడు. దానికి కారణం 1928లో టాటా ఉక్కు కర్మాగారంలో వేలాది మంది కార్మికులు ఆరు నెలలపాటు తీవ్రమైన సమ్మె కొనసాగించారు. ఈ సమ్మెను విరమింప చెయ్యటానికి కార్మికులకు, యాజమాన్యానికి మధ్యవర్తిగా గాంధీని పిలిచారు. కానీ గాంధీ కంపెనీ అనుకూల విధానాలు అనుసరించటంతో కార్మికుల సంక్షేమం మొత్తం పెట్టుబడిదారుల పాదాక్రాంతమై పోయింది. అలా అనేక పారిశ్రామిక వివాదాలోకి జాతీయ నాయత్వం తలదూర్చి కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా తొక్కి పడేశారు. అంతే కాకుండా 1926-29ల మధ్య అప్పటి కార్మిక నాయకుడు ఎన్‌యం జోషి కార్మికులకు రాజకీయాలు అవసరం లేదని తేల్చిచెప్పారు.
అంబేడ్కర్‌ అణిచివేయబడిన అంటారాని కులం నుండి వచ్చాడు. కాబట్టి కార్మికులు, ప్రధానంగా మహిళా కార్మికుల బాధలు బాగా అవగాహన చేసుకున్నాడు. తన విద్య ద్వారా ప్రపంచ కార్మికుల జీవితాలతోపాటు, భారతీయ కార్మికుల జీవితాలను కూడా తీవ్రంగా అధ్యయనం చేశాడు. ప్రపంచ కార్మికులకు, భారతీయ కార్మికులకు మధ్య అనేక తేడాలు న్నాయని గ్రహించగలిగాడు. ప్రపంచ కార్మికులు పెట్టుబడిదారీ వర్గంతో అణిచివేయబడుతుంటే, భారత్‌లో అదనంగా కులంతో కూడా అణిచివేతకి గురవుతున్నారని మొట్టమొదటిసారిగా బయట ప్రపంచానికి తెలియజేసిన ఘనత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌దే.
1920లో భారత రాజకీయ రంగంలోకి వచ్చిన డా. అంబేడ్కర్‌ ఒక్క దశాబ్దంలోనే భారత రాజకీయ రంగాన్ని, బ్రిటిష్‌ పాలకులను తన విద్య, ప్రతిభా పాఠవాలతో అత్యంత ప్రభావానికి గురిచేశాడు. ప్రతి విషయంలో కూడా అంబేడ్కర్‌ లేకుండా నిర్ణయం చెయ్యలేని స్థితికి బ్రిటిష్‌ పాలకులు చేరుకున్నారు, అంబేడ్కర్‌కి అలాంటి గుర్తింపునివ్వటం గాంధీకి అసలు ఇష్టంలేదు, అంతేకాదు.. అంబేడ్కర్‌ని బ్రిటిష్‌ వైస్రారు కమిటిలోకి తీసుకున్నాక 1930లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కూడా ఆహ్వానించబడ్డాడు. ఆ తరువాత అంబేడ్కర్‌ని వైస్రారు కమిటీలో కార్మిక సంక్షేమ బాధ్యతలను అప్పగించారు. తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో బ్రిటిష్‌ పాలకులకు కార్మికసంక్షేమంపైన అనేక సూచనలు చేశాడు. కార్మికులు సమ్మె చేయటం వారి ప్రాథమిక హక్కుని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలరాయకూడదని చెప్పాడు. కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు ఏ ప్రభుత్వ వ్యవస్థ బలప్రయోగం చేయకూడదని, కార్మికుల సమ్మెతో శాంతికి విఘాతం కలుగుతుందనే సాకుతో పోలీసు హింసను అసలు ప్రయోగించారాదని రాజ్యానికి సూచించాడు.
కార్మికులకు, యాజమాన్యాలకు మధ్య తలెత్తే అనేక సమస్యల పరిష్కారానికి దోహదం చేసే పారిశ్రామిక వివాదాల బిల్లును 1938లో బొంబాయి శాసనసభలో ప్రవేశపెట్టాడు. సమ్మె అంటే స్వేచ్ఛగా ఉండే హక్కుకు ప్రతిరూపమని, సమ్మెను తిరస్కరిస్తున్నామంటే వాళ్ళను మరింత బానిసత్వంలోకి నెట్టడమే నని అంబేడ్కర్‌ బలంగా అభిప్రాయం పడ్డాడు. కార్మికులు శాంతిగా బ్రతకాలంటే పరిశ్రమలకొచ్చే లాభాల్లో తొలి వాటాను కార్మికులకు పంచి సమానత్వాన్ని నెలకొల్పాలని బ్రిటిష్‌ ప్రధానికి సూచించాడు.
1943 మే 10న బొంబాయిలో జరిగిన కార్మికుల సభనుద్దేశించి డాక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. ''భారత దేశంలో శాంతి భద్రతలతో కూడిన కార్మిక రాజ్యం ఏర్పడాలంటే అన్ని వర్గాలకు చెందిన కార్మికులు తమ పోరాటాలు ముమ్మరంగా చేయాలని, భారత దేశానికి స్వాతంత్రం ఒక్కటే సరిపోదని, వచ్చిన స్వాతంత్య్రం ఎవరి చేతుల్లో ఉండాలో కూడా కార్మిక రంగమే నిర్ణయించాలని అంబేడ్కర్‌ సూచించారు.
బొంబాయిలో జ్యూట్‌ మిల్లు సమ్మెను కమ్యూనిస్టులతో కలిసి డా.అంబేడ్కర్‌ నిర్వహించడంతో ఆ సమ్మె అంచనాలకి మించి విజయం సాధించింది. అంబేడ్కర్‌తో జామ్నాదాస్‌ మెహతా వంటి బ్రాహ్మణ కులనాయకులు కలిచి పనిచేయటం తో కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత కమ్యూనిస్టులతో కలిసి అంబేడ్కర్‌ పనిచేయలేదు. ఇక్కడ కమ్యూనిస్టులు కార్మిక సంక్షేమం కంటే కూడా కుల సంక్షేమం, కట్టుబాట్లకే విలువిచ్చారు. అంతే కాకుండా పెట్టుబడిదారి వారి వర్గానికి కొమ్ముకాస్తూ, కార్మిక సంక్షేమాన్ని కాలరాచే, అభివద్ధి నిరోధకుడైన గాంధీతోనైనా జతకట్టారు గాని, నిత్యం కార్మిక సంక్షేమం గురించే ఆలోచిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం చేత ఎప్పటికప్పుడు మార్పులు చేపిస్తున్న అంబేడ్కర్‌ని అనుసరించలేక పోవటానికి ప్రధాన కారణం కులం తప్ప మరొకటి కాదు.
1944లో గనిలో కార్మికుల సంక్షేమం కోసం ఒక ఆర్ధిక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటిలోకి మొదటిసారిగా ఒక మహిళను కమిటిలోకి తీసుకునేలా అంబేడ్కర్‌ తీవ్రమైన కషి చేశాడు. బొగ్గు గనుల్లో పని చేసే మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా పనికి తగ్గ వేతనం కల్పించాలని కార్మిక ప్రతినిధిగా ప్రభుత్వ ఆదేశాన్ని విడుదల చేశాడు.
కార్మికులకు మరింత ప్రయోజనం కల్పించాలనే లక్ష్యం తో శాశ్వత ఉనికి కలిగిన కర్మాగారాల్లో పని చేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినం కల్పించే కార్మికబిల్లుని ప్రతిపాదించారు. ప్రపంచం మొత్తం ఎనిమిది గంటల పని దినాలుంటే, భారతదేశం అప్పటికి నిర్దిష్టమైన పని గంటలు లేవు. కంపెనీ యాజమాని ఇష్టప్రకారం పని గంటలుండేవి. కానీ పారిశ్రామిక వివాదాల పరిష్కార బిల్లుతో నిర్దిష్టమైన ఎనిమిది గంటల పనివిధానాన్ని, గని కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. గర్భిణీ స్త్రీల చేత లోతైన గనుల లోయలల్లో పని చేయించారాదని, వారు కాన్పు అయ్యేంత వరకు వేతనంతో కూడిన సెలవు దినాలు ఉండాలని కార్మిక ప్రతినిధిగా వైస్రారు కౌన్సిల్‌లో ఉండి సాధించగలిగాడు.
కులతత్వం అన్ని రకాల అభివద్ధికి ప్రతిబంధకంగా తయారవుతుందని, అన్ని రకాల దోపిడీని ఆరికట్టాలంటే ఉత్పత్తి సాధనాలన్ని ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, మత గురువులకు సొంత ఆస్తులుండకూడదని బలంగా అభిప్రాయ పడ్డాడు. కుల ప్రాతిపదికన ఏర్పడిన భూమి ఎస్టేట్లు గ్రామీణా భివద్ధిని విచ్చిన్నం చేస్తాయని, కనుక రైతుకు భూమిని పంచి ఇవ్వాలని బలంగా అభిప్రాయపడ్డాడు. కార్మికుల సంక్షేమం కోసం ఇంత తీవ్రంగా ఆలోచిస్తూ, తన ఆలోచనలను వైస్రారు కమిటీ చేత అమలు చేపిస్తున్న డాక్టర్‌ అంబేడ్కర్‌ని 1937 ఎన్నికల్లో ఓడించటానికి ఆనాటి కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రచారం చేశారు.
కార్మిక సంక్షేమం అని చెప్పుజుతిరిగే వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో కార్మిక హక్కులను సాధించిన పాపాన పోలేదు. అన్ని పరిశ్రమలు అగ్రకుల బ్రాహ్మణ, భనియాలకు చెందినవే కావటంతో సంపద చేజారకుండా ప్రతి కార్మిక ఉద్యమాన్ని తమ చేతుల్లోనే నడిచే బ్రాహ్మణ, శూద్ర అగ్రకుల నాయకులను కావాలనే కార్మిక నాయకులుగా ప్రమోట్‌ చేసుకున్నారు. కానీ ఏనాడు నేను కమ్యూనిస్టును అని చెప్పుకొని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వైస్రారు కమిటీ మెంబర్‌గా నిరంతరం కార్మిక సంక్షేమాన్ని కోరుకునే అనేక సంస్కరణలను తీసుకు వచ్చారు. కారణం కార్మిక వర్గంలో ఉన్నవారంతా కూడా అంటారానికులాలకు, ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో బాధ్యతగా వ్యవహరించాడు.
కానీ అగ్రకుల కమ్యూనిస్టు, కార్మిక నాయకులు అగ్రకులాల పారిశ్రామికవేత్తల పెట్టుబడులు విచ్ఛిన్నం కాకుండా తమ ఆందోళనలు చేస్తువచ్చారు. అంతేకాదు మార్క్స్‌ ప్రకటించి నట్లుగా పెట్టుబడిదారీ వర్గం ప్రపంచకార్మికులు ఏ విధంగా వ్యతిరేకమో, భారత కార్మికవర్గానికి కులవ్యవస్థ ప్రధాన శత్రువని ఏనాడూ ప్రకటించలేదు. భారత పెట్టుబడిదారీ వర్గంలో కులాన్ని గుర్తించ నిరాకరించారు, కారణం అగ్రకుల అవకాశవాదమే. కానీ అంబేడ్కర్‌ చేప్పినట్లుగా ఈ దేశంలో ఉన్న కులవ్యవస్థ కార్మికులను, ప్రజలను కులాలుగా విభజించటమే కాదు, శ్రామిక వర్గాలను కూడా కులాల వారిగా విభజిస్తుందని, కనుక కులవ్యవస్థ కార్మికవర్గం ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని, కులవ్యవస్థను కూల్చకుండా ఈ దేశంలో కార్మిక రంగానికి ఏమాత్రం న్యాయం చేయలేరని ఆనాడే ఇండియన్‌ కమ్యూనిస్టులను అంబేడ్కర్‌ హెచ్చరించాడు. కానీ భారత్‌లో కమ్యూనిస్టు, కార్మిక నాయకులు అవకాశవాదం తో వ్యవహరిస్తూ పెట్టుబడిదారుల ఆస్తులను కాపాడుతున్నారు. తద్వారా కులవ్యవస్థను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు.
ఈ దేశంలో అంబేడ్కర్‌ వైస్రారు కమిటీలో కార్మిక శాఖను చూడటంతోనే ఈ దేశంలో కార్మిక సంక్షేమానికి అనేక సంస్కరణలు చేసి కార్మికులకు నిజమైన ఆత్మబంధువుగా డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ని చెప్పుకోవచ్చు. అంబేడ్కర్‌ చేసిన కషి ఫలితంగానే ఈ మాత్రమైన హక్కులను నేటి కార్మికులు అనుభవించ గలుగుతున్నారు. కమ్యూనిస్టులు అనేక ఉద్యమాలు నిర్వహించినా వారు సాధించిన ఫలితాలు మొత్తం పారిశ్రామిక యజమానులకు అనుకూలమైనవే. ఇప్పటికి కార్మిక సంఘాలలో యాజమాన్య ధోరణినే కనిపిస్తుంది. లేవీలు వసూలు చేసుకొని వారి వారి కుటుంబాలను, పార్టీలను పోషించుకోవటానికే నేడు కార్మిక సంఘాలు పని చేస్తున్నాయి, తప్ప కార్మిక నియంతత్వ రాజ్యస్థాపన కోసం ఒక్క నిమిషం కూడా కేటాయించడం లేదు. కార్మిక నియంతత్వ రాజ్యాస్థాపన, కులనిర్మూలన కోసం నేటి కార్మికవర్గం మరింత సమరశిల ఉద్యమాలు నిర్మించినప్పుడే మనకు నిజమైన మేడే. 

 - రామలింగం కసుకుర్తి, అనంతవరం,
మొబైల్‌ నెం. 7675860850

image22